
జనం న్యూస్ 17 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోంటెస్సోరి పాఠశాల యాజమాన్యంపై తక్షణమే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) విజయలక్ష్మి కి వినతిపత్రం సమర్పించినట్లు యూ యస్ యాప్ ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వామన్ పల్లి రంగస్వామి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఫీజులు వసూలు చేయాలని, తల్లిదండ్రులపై అధిక ఆర్థిక భారం మోపే విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే పాఠశాలలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలని, స్థానిక విద్యార్థులకు తక్కువ ఫీజులతో సీట్లు కేటాయించి విద్యను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాజు మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించి పాఠశాల యాజమాన్యాలు వ్యవహరించాలని అన్నారు. స్థానిక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.