
జనం న్యూస్ జూన్ 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 12వ విడత "మొబైల్ రికవరీ మేళా" అత్యంత ఘనంగా నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, చేతుల మీదుగా రికవరీ చేసిన సుమారు రూ.1.65 కోట్ల విలువైన ఆపిల్, శాంసంగ్, వివో, రెడ్మి వంటి వివిధ ప్రముఖ కంపెనీలకు చెందిన 808 మొబైల్ ఫోన్లను వాటి అసలు యజమానులకు అందజేశారు. అనకాపల్లి జిల్లా చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.
"సాధారణ ప్రజలకు మొబైల్ అనేది కేవలం ఒక వస్తువు కాదు, వారి జీవితకాల జ్ఞాపకాలు, వ్యక్తిగత సమాచారం అందులోనే ఉంటాయి. ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్లు పోయినట్లు వస్తున్న ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాం. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక సెల్ ఐటి కోడ్ ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణ చేయడం వల్లే ఈ అద్భుతమైన ఫలితం సాధ్యమైంది. ఎంతో వ్యయప్రయాసలకోర్చి, సాంకేతిక పరిజ్ఞానంతో ఇతర రాష్ట్రాల నుండి కూడా ఫోన్లను రికవరీ చేసిన పోలీసు సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందించి, ప్రశంసా పత్రాలు నగదు రిర్డులను అందజేశారు."
రికవరీ వివరాల గణాంకాలు: మొత్తం ఫిర్యాదులు (01.06.2022 నుండి): 8,500 గత 11 విడతల్లో రికవరీ: 4,086 మొబైల్ ఫోన్లు
ఈ 12వ విడతలో రికవరీ: 808 మొబైల్ ఫోన్లు (రూ.1.65 కోట్లు, ఇప్పటివరకు మొత్తం రికవరీ: 4,894 మొబైల్ ఫోన్లు (మొత్తం విలువ సుమారు రూ. 8.42 కోట్లు,ఈ సంవత్సరంలో నమోదైన మిస్సింగ్ కంప్లైంట్స్: 1,543 అంతర్రాష్ట్ర స్థాయిలో ముమ్మర వేట అనకాపల్లి జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాల నుండి, అలాగే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ నుండి ఐటీ కోర్ సిబ్బంది ఈ మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి, రికవరీ చేశారు.పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే సులభంగా ఫిర్యాదు!ప్రజల సౌకర్యార్థం ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసే అవసరం లేకుండా, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే పని లేకుండా మొబైల్ రికవరీ ప్రక్రియను జిల్లా పోలీసులు సులభతరం చేశారు. ప్రజలు తమ ఫోన్లు పోగొట్టుకుంటే కింది మార్గాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు:CEIR పోర్టల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన https://www.ceir.gov.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేయవచ్చు. జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్: 9346912007 కు "Hi" అని టైప్ చేసి పంపితే వచ్చే లింక్ ద్వారా సులభంగా ఫిర్యాదు చేయవచ్చు.ప్రజలకు పోలీసు శాఖపై మరింత నమ్మకం, విశ్వాసం కలిగేలా అనకాపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం పనిచేస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్ రావు, ఎస్బీ డిఎస్పి జీ.ఆర్.ఆర్.మోహన్, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ కె.సతీష్ కుమార్, ఇన్స్పెక్టర్లు బాలసూర్యా రావు, శ్రీనివాసరావు, లక్ష్మీ, సేనం రమేష్, పిల్లా రమేష్, ఐటి కోర్ ఎస్సై బి.సురేష్ బాబు మరియు ఐటీ విభాగపు సిబ్బంది పాల్గొన్నారు