
ముమ్మడివరం, జనం న్యూస్: మురమళ్ళ శాసనసభ్యుల కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడారు. నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ముందుంచిన రెండేళ్ల ప్రభుత్వ పాలనా ప్రోగ్రెస్ రిపోర్ట్ పై ఆయన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ "గత వైసీపీ పాలనలో విద్వేషం, విధ్వంసమే లక్ష్యంగా సాగితే.. నేడు కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని స్థిరమైన అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో చెప్పిన ప్రతి అంకె వాస్తవం, ప్రతి విషయం ప్రభుత్వ విజయానికి ప్రత్యక్ష నిదర్శనం" అన్నారు. సంక్షేమానికి ₹1.49 లక్షల కోట్లు, అభివృద్ధి కార్యక్రమాలకు ₹1.34 లక్షల కోట్లు ఖర్చు చేశామని, రాష్ట్రంలోకి ₹23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించామని, 3,800 కిలోమీటర్ల గుంతలు లేని కొత్త రహదారులు నిర్మించామని తెలిపారు. ₹1.50 లక్షల కోట్ల రుణాలను రీషెడ్యూల్ చేసి వడ్డీ భారాన్ని తగ్గించడం ద్వారా ₹8,269 కోట్లు ఆదా చేశామని, ఉద్యోగులకు సంబంధించిన ₹30,849 కోట్ల బకాయిలు, గత ప్రభుత్వం వదిలిన ₹19,357 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించామని చెప్పారు. వైసీపీ హయాంలో నిలిపివేసిన 86 కేంద్ర పథకాలను పునరుద్ధరించామని, పెండింగ్ లో ఉన్న ₹8,695 కోట్లు జమ చేయించి, మొత్తం ₹45,138 కోట్ల నిధులు సాధించామని అన్నారు. ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, దీపం-2.0, ఎన్టీఆర్ వైద్యసేవ వంటి పథకాల ద్వారా ప్రతి నిరుపేద కుటుంబానికి మేలు చేస్తున్నామని, ఎస్సీ సంక్షేమానికి ₹19,100 కోట్లు 43 లక్షల మందికి, ఎస్టీ సంక్షేమానికి ₹5,730 కోట్లు 9 లక్షల మందికి, బీసీ సంక్షేమానికి ₹32,534 కోట్లు 1.18 కోట్ల మందికి, మైనారిటీ సంక్షేమానికి ₹4,856 కోట్లు 17 లక్షలకు పైగా మందికి అందించామని తెలిపారు. 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయాలనే లక్ష్యంతో రుణ మద్దతు కింద ₹2,246 కోట్లు అందించామని, బ్యాంకు అనుసంధానం ద్వారా 5,43,219 మందికి ఆసరా లభించిందని, గతంతో పోలిస్తే మూలధన వ్యయాన్ని 1.5 రెట్లు అధికంగా చేస్తున్నామని వివరించారుఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద నడింపల్లి సుబ్బరాజు, ఐ పోలవరం మండలపార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు, కాట్రేనికోన మండలపార్టీ అధ్యక్షులు చెల్లి అశోక్, ముమ్మిడివరం రూరల్ మండలపార్టీ అధ్యక్షులు అర్ధాని శ్రీనివాసరావు బిజెపి యనమండ్ర విజయకుమార్ నియోజవర్గంలో తెలుగుదేశం జనసేన బిజెపి మండల అధ్యక్షులు మరియు ప్రజా నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
.