
జనం న్యూస్ ఆగస్టు 1 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద 14 రకాల పంటల బీమా దరఖాస్తు గడువును ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగించినట్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల వ్యవసాయ అధికారిణి బి. మృధుల తెలిపారు. సర్వర్ సమస్యల కారణంగా ఇబ్బందులు పడిన రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ గడువు మాత్రం జూలై 31తో ముగిసిందని స్పష్టం చేశారు. మండలంలోని బ్యాంక్ రుణాలు తీసుకున్న, తీసుకోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే బీమా ద్వారా ఆర్థిక రక్షణ లభిస్తుందన్నారు. జిల్లాలో ప్రధానంగా సాగయ్యే వరి, కంది, మిరపతో పాటు మొత్తం 14 రకాల పంటలకు బీమా వర్తిస్తుందని, రైతులు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, భూమి రికార్డులు (1బి/అడంగల్/పట్టాదార్ పాస్‌బుక్), పంట సాగు ధృవీకరణ పత్రం, ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్‌తో అధికారిక వెబ్సైట్ https://pmfby.gov.in/ ద్వారా లేదా సమీప కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని కోరారు. చివరి నిమిషం వరకు ఆగకుండా తక్షణమే పంటలను బీమా పరిధిలోకి తెచ్చుకోవాలని వ్యవసాయ అధికారిణి సూచించారు.