
జనం న్యూస్. జూన్. 07. 06. 2026 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి. బి వీరేశంనియోజకవర్గంలో డీడీఎస్ (డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సభకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులను ఉద్దేశించి కలెక్టర్ ప్రసంగించారు. ప్రస్తుతం రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం కారణంగా భూమి సారవంతత తగ్గిపోవడంతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి ప్రతి రైతు ఆర్గానిక్ (సేంద్రీయ) వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు. సేంద్రీయ పద్ధతుల ద్వారా పండించే పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో పాటు రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. డీడీఎస్ సంస్థ గత అనేక సంవత్సరాలుగా గ్రామీణ మహిళల సాధికారత, సేంద్రియ వ్యవసాయం ప్రోత్సాహం, విత్తనాల సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ కోసం విశేష కృషి చేస్తోందని కలెక్టర్ ప్రశంసించారు. రైతులు సంప్రదాయ విత్తనాలను సంరక్షిస్తూ ప్రకృతి సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.ఈ సభలో ఆర్గానిక్ వ్యవసాయంలో విజయవంతమైన రైతులను సన్మానించారు. అలాగే సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, వాటి ప్రయోజనాలు, మార్కెటింగ్ అవకాశాలపై నిపుణులు రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీడీఎస్ ప్రతినిధులు, అధికారులు, రైతు సంఘాల నాయకులు, మహిళా సంఘాల సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.సభ ముగింపులో రైతులందరూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.