
జనం న్యూస్, ఆగష్టు 02, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమంలో మెట్పల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మైలారు రాంబాబు రాష్ట్ర యువజన విభాగపు అదనపు కార్యదర్శిగా ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు, యువ నాయకులు మైలారు రాంబాబును అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ప్రమాణ స్వీకారం అనంతరం మైలారు రాంబాబు మాట్లాడుతూ, ఆర్యవైశ్య యువతను సంఘటితం చేసి సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. విద్య, ఉపాధి, సేవా కార్యక్రమాలు, సామాజిక ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తూ యువతను ముందుకు తీసుకువెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో పలువురు రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, మైలారు రాంబాబు నాయకత్వంలో రాష్ట్ర యువజన విభాగం మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. అనంతరం ఆయనను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేసి ఘనంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, మెట్పల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు, మహిళా విభాగం సభ్యులు, యువజన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.