
జనం న్యూస్, ఆగస్టు 25, హైదరాబాద్ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్లోని మెడికల్ కౌన్సిల్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు చేపట్టిన ధర్నాకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మద్దతు తెలిపారు. ఆశా వర్కర్లతో కలిసి ధర్నాలో పాల్గొని, వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. వారి డిమాండ్లకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యం కోసం వారు అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడం, ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడం, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆశా వర్కర్ల సేవలు ఎంతో కీలకమన్నారు.ఇంతటి ప్రాధాన్యత కలిగిన సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు. తక్కువ పారితోషికాలు, పనిభారం, ఉద్యోగ భద్రతతో పాటు తమకు రావాల్సిన హక్కులు, ప్రోత్సాహకాలు తదితర అంశాలపై ఆశా వర్కర్లు చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కోరారు.ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తే ఆశా వర్కర్ల ఆందోళన మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వం పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు.ఆశా వర్కర్ల హక్కుల పరిరక్షణ కోసం, వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తాను ఎల్లప్పుడూ వారి వెంటే ఉంటానని ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు. ఆశా వర్కర్ల పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.