
గురువులను గౌరవించే సమాజమే అభివృద్ధిలో ముందంజ
జనం న్యూస్ సెప్టెంబర్ 5ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) 34 మంది ఉపాధ్యాయులను సత్కరించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువులను గౌరవించిన ఏ సమాజమైనా అభివృద్ధి పథంలో ముందంజలో ఉంటుందని, గురువులు బోధించిన జ్ఞానం, క్రమశిక్షణ, విలువలే విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గురువులను నిరంతరం స్మరించుకుంటూ వారి మార్గదర్శకత్వంలో నడిచే వారు జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారని పేర్కొన్నారు. మెరుగైన సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులే మూలస్తంభాలని కొనియాడారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ద్రాక్షారామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించిన టీచర్స్ డే వేడుకలకు మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో సేవలందిస్తున్న 34 మంది ఉపాధ్యాయులను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో ద్రాక్షారామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలు ఎంతో గర్వకారణమన్నారు. విద్యార్థిని కోన అభిశ్రీ 593 మార్కులతో జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం, 37 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు పొందడం, ఐదు మంది విద్యార్థులు ఐఐటీ సీట్లు సాధించడం పాఠశాల ఉపాధ్యాయుల అంకితభావం, కృషికి నిదర్శనమని ప్రశంసించారు.ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దుతున్న పాఠశాల తన నియోజకవర్గంలో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి అన్నారు. విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయుల శ్రమ, తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల పట్టుదల సమానంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం బాలికలు విద్యారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్నారని, సమాజ అభివృద్ధికి మహిళా విద్య అత్యంత కీలకమని చెప్పారు. స్త్రీలను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధిని సాధిస్తుందని పేర్కొంటూ విద్యార్థులు విద్యతో పాటు విలువలు, సంస్కారం, క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు.ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ, జ్ఞానాన్ని పంచి సమాజ అభివృద్ధికి మార్గదర్శకులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు సేవలు చిర స్మరణీయమని ప్రశంసించారు.సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, రామచంద్రపురం రూరల్ మండలం టిడిపి అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పెంకే అన్నపూర్ణ, టేకుమూడి సత్యనారాయణ, ముప్పనపల్లి గణేష్, మాజీ సర్పంచ్ కొత్తపల్లి అరుణ, రవ్వా భూషణం, పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, డీఆర్కే, ఆళ్ల బుజ్జి, బీజేపీ మండల అధ్యక్షులు అకేటి కృష్ణ, శివాజీ, కర్రా నాగేశ్వర్, ఇన్చార్జి హెచ్ఎం మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్టాఫ్ సెక్రటరీ అరవ విస్సు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.