
జనం న్యూస్ఆగస్టు 7 : నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం:ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏర్గట్ల మండలంలోని పలు పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ మాట్లాడుతూ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని, జీఓ-25 సవరించాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు.అలాగే బదిలీలు, పదోన్నతులు, టెట్‌లో సర్వీస్ వెయిటేజ్, సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలు, హెల్త్ కార్డులు, జీఓ-317 బాధితులకు న్యాయం తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 7 నుంచి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని, ఆగస్టు 12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసనలు, ఆగస్టు 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ఆగస్టు 29న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబరులో అసెంబ్లీ ముట్టడి చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షుడు పి. గణేష్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.