

జనం న్యూస్ ఆగస్టు 12:* ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రంగంపేట మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో నిర్వహించిన “కిసాన్ మేళా – రైతన్న మీకోసం” కార్యక్రమంలో శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తో కలిసి ఆమె పాల్గొన్నారు. తక్కువ నీటితో పండే పప్పు ధాన్యాలు, ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని, ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని కోరారు. చినుకు సేద్యం, తుంపర సేద్యం పరికరాలకు రాయితీపై దరఖాస్తులు స్వీకరించి రంగంపేట మండలాన్ని పూర్తి స్థాయిలో కవర్ చేస్తామని తెలిపారు. పంట బీమా రైతులకు రక్షణ కవచమని, అర్హులైన రైతులు తప్పనిసరిగా బీమా చెల్లించాలని సూచించారు. నీటిని కుటుంబ బడ్జెట్ లాగా పొదుపుగా వినియోగించాలని శాసన సభ్యులు నల్లమిల్లి కోరారు. అనంతరం చండ్రేడు, పెదరాయవరం గ్రామాల్లో రైతుల పొలాలను పరిశీలించి గగన వాహనంతో మందు పిచికారీ, నేల పరీక్ష విధానాలను అధికారులు వివరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.