
జనం జూన్ 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ సూచించారు.కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం హేమదుర్గ భవన్లో బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ మహిళా అధ్యక్షులతో ఓటరు నమోదు, జాబితా సవరణ కార్యక్రమాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బండి రమేష్ పార్టీ నాయకులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. కొత్త ఓటర్ల నమోదు, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు జాబితాలో ఉండేలా ప్రజలకు సహకారం అందించాలని సూచించారు.ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్లక్ష్యంగా తీసుకునే నాయకులపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి డివిజన్లో అర్హత కలిగిన ప్రతి వ్యక్తి ఓటు నమోదు అయ్యేలా నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పార్టీ బ్లాక్, డివిజన్, మహిళా విభాగాల అధ్యక్షులు, నాయకులు పాల్గొని ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.