
మున్సిపల్ కార్మికులకు రాఖీలు కట్టి, స్వీట్లు–వస్త్రాలు అందజేసిన తేజస్విని
జనం న్యూస్, ఆగస్టు 28, జగిత్యాల జిల్లా : మెట్పల్లి మెట్పల్లి పట్టణంలోని 15వ వార్డులో రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని సోదరభావం, మానవత్వం, సమానత్వాన్ని చాటే విధంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 15వ వార్డు కౌన్సిలర్ అరిగెల అనూష రాకేష్ కుమార్తె తేజస్విని మున్సిపల్ కార్మికులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.ప్రజల ఆరోగ్యం, పట్టణ పరిశుభ్రత కోసం నిత్యం శ్రమిస్తూ విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులను సోదరులుగా భావిస్తూ తేజస్విని వారికి రాఖీలు కట్టారు. అనంతరం వారి సేవలను గుర్తిస్తూ స్వీట్లు, వస్త్రాలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం ద్వారా కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా అందరూ సమానమేనన్న సందేశాన్ని అందించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ అరిగెల అనూష రాకేష్ మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ కేవలం అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో సోదరభావం, ఆత్మీయత, మానవతా విలువలను పెంపొందించే పండుగగా నిలుస్తుందని అన్నారు.కులమత భేదాలు, ఆర్థిక అసమానతలు లేకుండా ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ, ఆప్యాయతతో మెలగాలని ఆకాంక్షించారు. రక్షాబంధన్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో, సంతోషంగా జరుపుకోవాలని కోరారు.ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు మున్సిపల్ కార్మికులు ప్రతిరోజూ కష్టపడి పనిచేస్తున్నారని, వారి సేవలు ఎంతో విలువైనవని కౌన్సిలర్ అనూష రాకేష్ పేర్కొన్నారు. సమాజం కోసం సేవలందిస్తున్న కార్మికులను గౌరవించడం మనందరి బాధ్యత అని అన్నారు.రాఖీ కట్టడం, స్వీట్లు మరియు వస్త్రాలు అందించడం ద్వారా మున్సిపల్ కార్మికుల్లో ఆనందాన్ని నింపారు. ఈ కార్యక్రమం 15వ వార్డులో ఆత్మీయ వాతావరణంలో నిర్వహించడంతో పలువురు అభినందించారు. కులమతాలకు అతీతంగా నిర్వహించిన ఈ రక్షాబంధన్ వేడుక సోదరభావం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.