
క్రాప్ హాలిడే దిశగా ఆక్వా రైతులు!
జనం న్యూస్ మే 29 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి ఆక్వా సమన్వయ కమిటీ అధ్యక్షులు బొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి వచ్చిన ఆక్వా రైతులు ప్రస్తుత ఆక్వా రంగ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.మేత ధరల భారం, సీడ్ నాణ్యత లోపం, పతనమవుతున్న రొయ్యల ధరలు, ఎక్స్‌పోర్టర్ల దోపిడి వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం ఆక్వా రంగం వెంటిలేటర్‌పై ఉందని, ప్రభుత్వం తక్షణం జీవం పోయాలని రైతులు కోరారు.గతంలో 100 కౌంట్ రొయ్యల ధర రూ.270 వరకు పెంచాలని ప్రాసెసింగ్ ప్లాంట్లు నిర్ణయం తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఆక్వా పంటకు సరైన రేటు లేక రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టన్నుకు రూ.40 వేల వరకు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.సీడ్, ఫీడ్ ప్రొడ్యూసర్లు, ఎక్స్‌పోర్టర్లు లాభాలు పొందుతున్నప్పటికీ రైతులు మాత్రం నష్టాల్లో మగ్గుతున్నారని విమర్శించారు. ఆక్వా రంగం మనుగడ సాగాలంటే సీడ్, మేత, ధరల విషయంలో రైతులకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వం తమ సమస్యలను అర్థం చేసుకుని విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ట్రాన్స్ఫార్మర్ ఛార్జీల భారం భరించలేకపోతున్నామని, కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రంగం ద్వారా 40 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తోందని రైతులు పేర్కొన్నారు. దేశానికి డాలర్ రూపంలో విదేశీ మారకద్రవ్యం తీసుకువస్తున్న ఆక్వా రంగాన్ని ప్రభుత్వం కాపాడాలని విజ్ఞప్తి చేశారు.దేశంలో రొయ్యలు, చేపల వినియోగం పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. “మార్గశిర కార్తిలో రొయ్యలు, చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెప్పిన విషయాన్ని ప్రజలు పాటించాలి” అని రైతు నాయకులు సూచించారు. ఈ సందర్భంగా పేదలకు ఉచితంగా రొయ్యలు, చేపలు పంపిణీ చేస్తామని తెలిపారు.రాష్ట్రస్థాయి కమిటీ ద్వారా జిల్లాలు, మండలాల వారీగా కార్యాచరణ ప్రారంభిస్తామని రైతు సంఘ నాయకులు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణం ఆక్వా రంగంపై సరైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వస్తుందని రైతులు హెచ్చరించారు. ఆక్వా రంగంలోని దోపిడి వ్యవస్థపై సమగ్ర విచారణ జరిపి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. భీమవరం ఆక్వా అసోసియ అధ్యక్షులు తులసి రాంబాబు సెక్రెటరీ సుబ్బరాజు , రమేష్ రాజు, దాట్ల పృధ్వీ రాజు , త్సవటపల్లి నాగభూషణం, నాని రాజు, సత్తిబాబు రాజు తదితరులు పాల్గొన్నారు.