
జనం న్యూస్,జూన్ 27,జగిత్యాల జిల్లా, కోరుట్ల : కోరుట్ల పట్టణ ప్రజల భద్రత దృష్ట్యా కోరుట్లలో అత్యవసరంగా ప్రత్యేక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కోరుట్ల పట్టణం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో అగ్నిప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానికంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం సమీప ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు రావడానికి సమయం పడుతుండటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కోరుట్లకు ప్రత్యేక ఫైర్ స్టేషన్‌ను త్వరితగతిన మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఎమ్మెల్యే సంజయ్ కోరారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన మంత్రి, సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.కోరుట్ల ప్రజల చిరకాల కోరిక అయిన ఫైర్ స్టేషన్ ఏర్పాటు త్వరలోనే నెరవేరుతుందనే ఆశాభావాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.