
జనం న్యూస్, జులై 25, జగిత్యాల జిల్లా, కోరుట్ల : కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎం. చిరంజీవిని ఎలాంటి సమగ్ర విచారణ లేకుండానే సస్పెండ్ చేయడం అన్యాయమని పేర్కొంటూ కోరుట్ల నియోజకవర్గ అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు శనివారం వినతిపత్రం సమర్పించారు.కోరుట్లకు వచ్చిన కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి, కోరుట్ల ఎస్సై ఎం. చిరంజీవిపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఇటీవల మెట్పల్లిలో హత్యకు గురైన కర్రే సునీత కోరుట్ల పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇచ్చిందనే ప్రచారం వాస్తవానికి విరుద్ధమని పేర్కొన్నారు. బాధితురాలు ఫిర్యాదు చేయకుండా కసుల గంగారెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు.ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపకుండానే దళిత అధికారిగా పనిచేస్తున్న ఎం. చిరంజీవిపై చర్యలు తీసుకోవడం బాధాకరమని వారు అన్నారు. అసలు బాధితురాలిని ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఎలాంటి తప్పు నిరూపితం కాకముందే ఎస్సైను సస్పెండ్ చేయడం అన్యాయమని పేర్కొన్నారు.అలాగే ఎం. చిరంజీవిపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కర్రే సునీత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని, అలాగే ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కసుల గంగారెడ్డిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్‌ను కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ పేట భాస్కర్, బలిజ రాజారెడ్డి, వుయ్యాల నర్సయ్య, చెట్పల్లి లక్ష్మణ్, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, ఉయ్యాల శోభన్, పసుల కృష్ణ ప్రసాద్, శనిగారపు రాజేష్, బలిజ రాజశేఖర్, పసులు చిన్నయ్య, మోర్తాడ్ రాజశేఖర్, సామల్ల వేణు, సత్యం, నారాయణతో పాటు దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.