

జనం న్యూస్ 30 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; పోలీసు విధుల్లో సమర్థవంతంగా పనిచేయాలంటే క్రీడలు వ్యాయామం తప్పనిసరి: జిల్లా ఎస్పీ 10వ బెటాలియన్ వార్షిక క్రీడలు 2026 ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు ట్రోఫీలు పతకాలు అందజేసిన జిల్లా ఎస్పీ జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద ఉన్న తెలంగాణ స్పెషల్ పోలీస్ 10వ బెటాలియన్లో మూడు రోజుల పాటు ఉత్సాహభరితంగా నిర్వహించిన వార్షిక క్రీడలు–2026 మంగళవారం ఘనంగా ముగిశాయి. ఇట్టి ముగింపు కార్యక్రమానికి గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, గద్వాల జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ నర్సింగ్ రావు అతిథిగా పాల్గొన్నారు. 10వ బెటాలియన్ కమాండెంట్ ఎం. జయరాజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన అధికారులు సిబ్బంది క్రీడాకారులకు ముఖ్య అతిథులు ట్రోఫీలు పతకాలు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలను ప్రత్యేకంగా ప్రశంసించారు.ఈ సందర్భంగా ఎస్పీ టి శ్రీనివాసరావు ఐపీఎస్ మాట్లాడుతూ క్రీడలు మనిషి జీవితంలో విడదీయరాని భాగమని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ప్రశాంతత క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు సమయపాలన జట్టు స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగం అనేక సవాళ్లతో కూడుకున్నదని విధుల్లో సమర్థవంతంగా పనిచేయాలంటే ప్రతి పోలీసు ఉద్యోగి నిత్యం వ్యాయామం చేస్తూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. గెలుపు ఓటములు సహజమని, పోటీలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో పాటు క్రీడా స్ఫూర్తిని చాటడమే నిజమైన విజయమని అన్నారు. ఇలాంటి వార్షిక క్రీడలు పోలీసు సిబ్బందిలో ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంపొందించడంతో పాటు పరస్పర ఐక్యత, స్నేహభావం, సేవా నిబద్ధతను మరింత బలోపేతం చేస్తాయని ఎస్పీ తెలిపారు.జాయింట్ కలెక్టర్ నర్సింగ్ రావు మాట్లాడుతూ పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో శారీరక మానసిక దృఢత్వం ఎంతో ముఖ్యమని అన్నారు. క్రీడలు ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది వేయడంతో పాటు క్రమశిక్షణ పట్టుదల సమష్టి కృషి వంటి లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. బెటాలియన్ సిబ్బంది ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమని ఇటువంటి క్రీడా కార్యక్రమాలు పోలీసు సిబ్బందిలో ఉత్సాహాన్ని పెంచడంతో పాటు వారి కుటుంబాల్లో కూడా ఆనందం ఆత్మీయతను పెంపొందిస్తాయని అన్నారు. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతూ విధుల్లో మరింత అంకితభావంతో సేవలందించాలని ఆకాంక్షించారు.బెటాలియన్ కమాండెంట్ శ్రీ ఎం. జయరాజు మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీల్లో క్రమశిక్షణతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులు, సిబ్బంది, క్రీడాకారులకు, అలాగే కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహిళలు, కుటుంబ సభ్యుల కోసం నిర్వహించిన ప్రత్యేక క్రీడా పోటీలకు విశేష స్పందన లభించిందని, ఇలాంటి కార్యక్రమాలు కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు.మూడు రోజుల పాటు ఉత్సాహభరిత వాతావరణంలో సాగిన వార్షిక క్రీడలు–2026 బెటాలియన్లో క్రీడా స్ఫూర్తి, శారీరక దృఢత్వం, మానసిక ఉత్సాహం, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ విజయవంతంగా ముగిశాయి.ఈ కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు పార్థసారథి రెడ్డి అలంపూర్ సిఐ ప్రదీప్ కుమార్, పాణి వెంకటరమణ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రాజు నరసింహారాజు ఆర్.పీ. సింగ్ శ్రీనివాస్ తిరుపతి రాజేశం బెటాలియన్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్ ఇతర అధికారులు సిబ్బంది కుటుంబ సభ్యులు, ఆహ్వానితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు