
జనం న్యూస్, జూన్ 26, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, వేములకుర్తి: వేములకుర్తి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ, 16 కుల సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మహాలక్ష్మి, గంగమ్మ, తాతమ్మ గ్రామదేవతలకు ఘనంగా మొక్కులు చెల్లించారు. గ్రామంలో సుఖశాంతులు నెలకొని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామానికి ఎలాంటి అపాయాలు, అంటువ్యాధులు, ప్రకృతి విపత్తులు సంభవించకుండా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రధాన వీధుల గుండా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా గోల్లెం ఉరేగింపు నిర్వహించారు. దప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి చీరసారలు, గంగమ్మ, తాతమ్మ దేవతలకు సంబంధించిన వస్త్రాలు, పూజా సామగ్రిని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి పారవశ్యంలో అమ్మవారికి జైజైలు పలికారు.పలు ప్రాంతాల్లో పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులను అలరించాయి. మహిళలు బోనాలు, పూజా ద్రవ్యాలతో ఊరేగింపులో పాల్గొనగా, యువకులు సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. గ్రామంలోని చిన్నారులు కూడా ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చారు.గ్రామదేవతల పండుగలు గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని, ఇటువంటి ఆచారాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. కుల, మత భేదాలు లేకుండా గ్రామ ప్రజలందరూ ఒకే వేదికపై కలిసి మొక్కులు చెల్లించడం గ్రామ ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందని వారు తెలిపారు.అనంతరం గ్రామస్తులు, మహిళలు, అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను చెల్లించారు. అమ్మవారి కృపతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సిరిసంపదలు కలగాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎడిపెల్లి మురళి, సర్పంచ్ తరి రామానుజం, ఉపసర్పంచ్ బర్మ మల్లయ్య, అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు మెగిలి దేవదాస్, కోశాధికారి అన్నరపు రాజరెడ్డి, రైటర్ పెంట మహేష్, కమిటీ సభ్యులు అంకతి రాజలింగం, కుమ్మరిపెల్లి మల్లేశం, పల్లి పెద్దలు, జిల్లా ఆనందం, అల్లెపు మహేష్, మాలేపు లక్ష్మణ్, సిలివేరి మహేష్, అక్కపెల్లి గంగాధర్, కనపర్తి నరేష్, పట్నం నర్సయ్య, గుడ్ల శ్రావణ్, మగ్గిడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.