
సాగర్ కు పోటెత్తిన భక్తజనం
సాగర్ లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
జనం న్యూస్ - జూలై25- నాగార్జునసాగర్ టౌన్-తొలి ఏకాదశి పర్వదినాన్ని శనివారం నాడు నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ లో భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సంవత్సరం తొలి ఏకాదశి శనివారం నాడు రావడంతో సాగర్ చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో సాగర్ కు చేరుకొని కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి దేవాలయాలలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ లోని కృష్ణా నది తీరాన ఉన్న దేవాలయాలు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో కిటకిటలాడాయి. సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో సాగర్ లో వాహనాల రద్దీ పెరగడంతో నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్, సాగర్ టౌన్ ఎస్ఐ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. హిల్ కాలనీలోని రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా 300 మందికి పైగా దంపతులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం దేవాలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మంచికంటి కిషోర్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా స్థానిక ఎస్ఐ సతీష్ ముఖ్య అతిథిగా హాజరైనారు. నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం తక్కువగా ఉండడంతో భక్తులు స్నానాలు చేయడానికి తీవ్ర ఇబ్బందులకు గురైనారు. కృష్ణా నది తీరాన నదిలో లోతైన ప్రాంతంలో స్నానాలకు భక్తులు వెళ్లకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాగర్ పోలీసులు బందోబస్తు చర్యలను నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా అధిక సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు సాగర్ కి రావడంతో సాగర్ లోని పర్యటక ప్రాంతాలైన బుద్ధవనం, లాంచి స్టేషన్, ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కొత్త బ్రిడ్జి వద్ద సందడి నెలకొంది.