
జనం న్యూస్, మెట్పల్లి, జూలై 1: జనం న్యూస్, జులై 1st, జగిత్యాల జిల్లా మెట్పల్లి : పట్టణ బస్టాండ్లో ఓ ప్రయాణికుడి మొబైల్ ఫోన్ను దొంగిలించి పారిపోతున్న మైనర్ బాలుడిని ఆర్టీసీ సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.వివరాల్లోకి వెళితే, ఓ ప్రయాణికుడు బస్సు ఎక్కుతున్న సమయంలో అతని విలువైన మొబైల్ ఫోన్ను మైనర్ బాలుడు దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన బస్టాండ్ సిబ్బంది హనీఫ్ వెంటనే అప్రమత్తమై బాలుడిని వెంబడించి పట్టుకున్నారు.అనంతరం పోలీసులకు సమాచారం అందించగా, ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దొంగిలించబడిన మొబైల్ ఫోన్ను బాధితుడికి అప్పగించినట్లు తెలిసింది.ఈ సందర్భంగా బస్టాండ్ అధికారులు, పోలీసులు ప్రయాణికులు బస్సులు ఎక్కే సమయంలో తమ విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్లు, నగదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే బస్టాండ్ సిబ్బందికి లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు దొంగతనాల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.