
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి. వీరేశం జూన్. 27. 06. 2026జహీరాబాద్ నియోజకవర్గంలోని నాగిశెట్టి తాండా రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డులో చెత్తను విచ్చలవిడిగా కాల్చివేస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ చెత్తను తగులబెట్టడం వల్ల దట్టమైన పొగ వ్యాపించి పరిసర ప్రాంతాల ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే విధంగా చెత్తను బహిరంగంగా దహనం చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ పొగ వల్ల ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయని పేర్కొన్నారు. డంపింగ్ యార్డులో శాస్త్రీయ పద్ధతుల్లో చెత్త నిర్వహణ చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే చెత్తను కాల్చే చర్యలను నిలిపివేసి, పర్యావరణానికి ఎటువంటి హాని కలగ కుండా శాస్త్రీయ విధానంలో చెత్త నిర్వహణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై జిల్లా అధికారులు, కాలుష్య నియంత్రణ శాఖ మరియు సంబంధిత ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు