
జనం న్యూస్ జూన్ 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఆర్డీఓ డి.ఎస్. వెంకన్న గురువారం శాయంపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి కార్యాలయ పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా రెవెన్యూ శాఖలో పెండింగ్లో కార్యాలయంలో ఉన్న దరఖాస్తులు, ప్రజావాణి ఫిర్యాదులు, భూ భారతి దరఖాస్తులు, మ్యుటేషన్లు, వారసత్వ కేసులు, భూ సమస్యల పరిష్కార విధానం తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆర్డీఓ వెంకన్న రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవల వేగం, పారదర్శకతపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు కార్యాలయానికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ పేద ప్రజలకు అండగా నిలవాలి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి అని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయాలి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి అని సూచించారు. ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శాయంపేటలోని చేనేత వస్త్ర విక్రయశాలను సందర్శించిన ఆర్డీఓ అక్కడ విక్రయిస్తున్న వివిధ రకాల చేనేత వస్త్రాలను పరిశీలించారు. చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాల నాణ్యత, డిజైన్లు, ధరల గురించి వివరాలు తెలుసుకుని కొన్ని వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా చేనేత ఉత్పత్తుల నాణ్యత ఎంతో మెరుగ్గా ఉండటంతో పాటు ధరలు కూడా అందుబాటులో ఉన్నాయని ప్రశంసించారు. ప్రజలు చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. చేనేత సంఘాన్ని సందర్శించిన ఆర్డీఓ అక్కడ ఉన్న మిషనరీని పరిశీలించారు. యంత్రాల పనితీరు, ఉత్పత్తి ప్రక్రియ గురించి తెలుసుకుని కార్మికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తుందని పేర్కొంటూ, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సబ్సిడీలను పూర్తిస్థాయిలో వినియోగించు కోవాలని సూచించారు. చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్. ప్రవీణ్ కుమార్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, చేనేత సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు....