
*ఎనిమిది వందల మంది లబ్ధిదారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి – అధికారులతో వెంటనే మాట్లాడిన బండి రమేష్*
జనం న్యూస్ | జూలై 17 | తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్: శ్రీనివాస్ రెడ్డి: దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భూదాన్ ల్యాండ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి సుమారు ఎనిమిది వందల మంది లబ్ధిదారులకు న్యాయం చేయాలని బాధితులు టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.మూసాపేట ఆంజనేయ నగర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బండి రమేష్‌ను కలిసిన బాధితులు, కొందరు స్థానిక రాజకీయ నాయకులు ఐడీపీఎల్ ఉద్యోగుల అండతో సుమారు 17 ఎకరాల భూదాన్ భూమిని అక్రమంగా ఆక్రమించి అసలైన హక్కుదారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు ఒత్తిళ్లకు లోనై సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బాధితుల నుంచి సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న బండి రమేష్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, హైకోర్టు ఆదేశాల మేరకు తక్షణ చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అక్రమాలకు లేదా ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు అధికారులు తలొగ్గితే, ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చూస్తానని స్పష్టం చేశారు. భూదాన్ భూముల అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు తాను వారి పక్షాన నిలబడి పోరాడుతానని బండి రమేష్ హామీ ఇవ్వడంతో బాధితులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, ఖలీమ్ ఖాన్, ఫాల్గుణరావు, చందర్రావు, వాసు, నారాయణ, ఆంజనేయులు, రఘువీర్, మల్లికార్జున్, వాణి, కనకమ్మ వజ్రం తదితరులు, భూదాన్ ల్యాండ్ లబ్ధిదారులు పాల్గొన్నారు.