
కోతుల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు
జనం న్యూస్- జులై 29- నాగార్జునసాగర్ టౌన్-విశ్వవిఖ్యాత పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్ లో కోతుల బెడద తీవ్రస్థాయికి చేరింది రోజురోజుకు పెరుగుతున్న వానరాల సంఖ్య వాటి దాడులతో స్థానిక ప్రజలు వ్యాపారులు పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు, స్థానిక ఇళ్లల్లోకి చొరబడటం చేతిలో ఉన్న సామగ్రిని లాక్కోవడమే కాకుండా మనుషులపై ఎగబడి దాడులు చేస్తుండడంతో నందికొండ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. వీధులలో కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ వాహనాలపై వెళ్లే వారిపై కూడా దాడులకు దిగుతుండడంతో ద్విచక్ర వాహనదారులు సైతం భయాందోళనలకు గురవుతున్నారు. స్థానిక దుకాణాల ముందు ఉంచిన వస్తువులను సైతం ఎత్తుకెళ్లడంతో స్థానిక వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, పండ్లు కూరగాయల వ్యాపారుల సైతం కోతులతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, పిల్లలు ఒంటరిగా వెళ్లే మహిళలపై కోతులు ఒక్కసారిగా దాడికి దిగబడుతున్నాయి, ఇటీవల పలువురు వీటి దాడుల్లో గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు. బుధవారం రోజున స్థానిక మహిళ ఒకరు పని చేసుకుని తిరిగి వెళుతుండగా కోతులు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. గతంలో నందికొండ పురపాలక సంఘం పరిధిలోని మంచినీటి ట్యాంకుల్లో కోతులు పడి మృతి చెందిన ఘటనలు స్థానికులను తీవ్రంగా కలవరపెట్టాయి మున్సిపల్ అధికారులు సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తాగునీరు కలుషితమై రోగాల బారిన పడే ప్రభావం ఉందనడానికి ఇదే నిదర్శనమని ప్రజలు వాపోతున్నారు, ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఇప్పటికైనా అధికారులు, స్థానిక రాజకీయ నాయకులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో కోతుల బెడద పై సమాచార హక్కు మానవ హక్కు లా సమితి ఆధ్వర్యంలో స్థానిక స్కూల్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతి పత్రం ఇచ్చినా కూడా స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు, పగలు రాత్రి తేడా లేకుండా కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయని చేతిలో కర్ర లేకపోతే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని పర్యాటకులు కూడా భయపడిపోతున్నారని మున్సిపల్ అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి కోతులను పట్టుకుని దట్టమైన అటవీ ప్రాంతాలకు తరలించాలని, అధికారులు స్థానిక రాజకీయ నాయకులు తక్షణమే స్పందించి వానరాల బెడద నుంచి తమను రక్షించాలని నందికొండ మున్సిపాలిటీ నివాసితులు కోరుతున్నారు.