
ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిని ప్రజలే తిప్పికొట్టారు
జనం న్యూస్ సెప్టెంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) చంద్రబాబు అక్రమ అరెస్టుతో జగన్ తన పతనాన్ని తానే కొనితెచ్చుకున్నాడురాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టిసుభాష్ కక్ష రాజకీయాలు ఓడిపోయాయి... ప్రజాస్వామ్యం గెలిచింది... అహంకారం కూలిపోయింది... నిజం నిలిచింది అని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై జరిగిన అక్రమ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని, చివరకు నిజం గెలిచి అహంకారం ఓడిపోయిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు.చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం రావులపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ కొవ్వొత్తులు వెలిగించి ప్రజాస్వామ్య విజయాన్ని స్మరించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాజకీయ కక్షతో ఒక జాతీయ నాయకుడిని అవమానించాలని, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం చివరకు ఆయన రాజకీయ పతనానికే కారణమైందన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్టు చేయడం ద్వారా జగన్ తన పతనాన్ని తానే కొనితెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.ఐదు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న ఒక అనుభవజ్ఞుడైన నాయకుడిని అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టాలని చూసినా, ప్రజల ప్రేమను, విశ్వాసాన్ని ఎవరూ బంధించలేకపోయారని మంత్రి పేర్కొన్నారు. నంద్యాలలో జరిగిన ఆ అరెస్టు కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదని, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడిగా ప్రజలు భావించారని అన్నారు.ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు, మేధావులు, ఐటీ నిపుణులు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా స్పందించారని గుర్తు చేశారు. ప్రజల హృదయాల్లో ఉన్న చంద్రబాబును జైలులో పెట్టి ప్రజల మనసుల నుంచి తొలగించగలమని భావించిన వారు చివరకు ప్రజా తీర్పుతో చరిత్రలో కనుమరుగయ్యారని విమర్శించారు.అన్యాయం ఎంత బలంగా కనిపించినా సత్యం ముందు నిలవలేదు. అహంకారం ఎంత ఎత్తుకు ఎదిగినా ప్రజా తీర్పు ముందు తలవంచక తప్పదు. చంద్రబాబు నాయుడు గారిపై జరిగిన అక్రమ అరెస్టుకు ప్రజలే సమాధానం చెప్పారు. ఆ సమాధానమే కూటమి ప్రభుత్వ విజయానికి పునాది అయింది" అని మంత్రి స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి, సంక్షేమ మార్గంలో పయనిస్తోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పాలన అందిస్తోందని తెలిపారు. ప్రజల విశ్వాసం, న్యాయవ్యవస్థపై నమ్మకం, సత్యం పట్ల నిబద్ధత చివరకు విజయం సాధించాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ రెడ్డి అనంతకుమారి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుల రామకృష్ణతో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.