
జనం న్యూస్, ఆగష్టు 05, జగిత్యాల జిల్లా, కోరుట్ల : ఈ రోజు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నియోజకవర్గంలోని పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ముందుగా కోరుట్లలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే, విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు.అనంతరం మొహన్రావుపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాల, మధాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలను సందర్శించి తరగతి గదులు, పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధన విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.మధాపూర్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఎమ్మెల్యే, భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, "విద్యార్థులే దేశ భవిష్యత్తు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం కష్టపడాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల శ్రమను గుర్తించి క్రమశిక్షణతో చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఏ సమస్య ఉన్నా నిర్భయంగా ఉపాధ్యాయులు, అధికారుల దృష్టికి తీసుకురావాలి" అని సూచించారు.పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, అన్ని మౌలిక సదుపాయాలు అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.