
జనం న్యూస్ జూన్ 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పీఎన్ఎం పాఠశాలలో సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. "డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన, మత్తు రహిత భవిష్యత్తును ఎంచుకోండి" అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై పోలీసులు సమగ్రంగా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు యువత జీవితాలను, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తాయని హెచ్చరించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్యపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. "మత్తు వద్దు… మంచి భవిష్యత్తు ముద్దు" అనే నినాదంతో యువతలో చైతన్యం పెంపొందించేందుకు విస్తృత ప్రచారం చేపడుతున్నట్లు తెలిపారు.డ్రగ్స్‌కు సంబంధించిన ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్-100ను సంప్రదించాలని సైబరాబాద్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాజంలో మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్, బాలానగర్ ఏసీపీ పి. నరేష్‌రెడ్డి, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.