
జనం న్యూస్ ఆగస్టు 25 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శాసనసభ్యుల కార్యాలయంలో నిర్వహించిన సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మండలాల వారీగా ముమ్మిడివరం మండలం 35 మంది లబ్ధిదారులకు సుమారు 15 లక్షలు, ముమ్మిడివరం నగర పంచాయతీ 18 మంది లబ్ధిదారులకు 14 లక్షలు, కాట్రేనికోన మండలం 33 మంది లబ్ధిదారులకు 15.2 లక్షలు, ఐ.పోలవరం మండలం 35 మంది లబ్ధిదారులకు 14 లక్షలు, తాళ్లరేవు మండలం 35 మంది లబ్ధిదారులకు 27 లక్షలు చొప్పున మొత్తం 156 మంది లబ్ధిదారులకు 88 లక్షలు విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ప్రజలకు అత్యవసర వైద్య అవసరాల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా సిఎంఆర్ఎఫ్ ద్వారా వేగవంతంగా సహాయం అందిస్తూ ఇప్పటివరకు వేల కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయం పంపిణీ చేయడం జరిగిందని, ముమ్మిడివరం నియోజకవర్గంలో ఇప్పటివరకు మొత్తం సుమారు 8 కోట్ల రూపాయలకు పైగా సిఎంఆర్ఎఫ్ సహాయం అర్హులైన బాధిత కుటుంబాలకు అందించామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం చేరేలా నిరంతరం కృషి కొనసాగిస్తామని శాసనసభ్యుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, మాజీ శాసనసభ్యుడు వివేకానంద, టిడిపి ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు విత్తనాల వెంకటరమణ నాలుగు మండల పార్టీల అధ్యక్షులు, కూటమి నాయకులు, అభిమానులు, ప్రజలు, మీడియా మిత్రులు పాల్గొన్నారు.