
తాళ్లరేవు, జనం న్యూస్: తాళ్లరేవు మండలం శ్రీ బొడ్డు సత్యనారాయణ ఫంక్షన్ హాల్లో మహనీయుడు, సామాజిక సంస్కర్త, విద్యా ప్రబోధకుడు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ 157వ జయంతి ఉత్సవాలు ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనమండలి సభ్యులు కొణిదల నాగబాబు, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరావు, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంస్థ అధ్యక్షులు పాపారావు, కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ హరేంద్రి ప్రసాద్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ, సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షులు తుమ్మల బాబు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మొదట కోరంగి గ్రామంలో పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ మరియు మల్లాడి సత్యలింగ నాయకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం సభా ప్రాంగణంలో వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యా వికాసం, సామాజిక సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. వారి ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, విద్య ద్వారా సమాజంలో సమాన అవకాశాలు కల్పించాలనే వారి సంకల్పం చిరస్మరణీయమని పేర్కొన్నారు. పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర జయంతిగా ప్రకటించడం అగ్నికుల క్షత్రియ సమాజానికి దక్కిన గొప్ప గౌరవమని అన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సవితకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అగ్నికుల క్షత్రియుల సంక్షేమం, అభివృద్ధి, విద్య, ఉపాధి, సామాజిక పురోగతికి పూర్తిస్థాయి నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు. మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని యువత విద్యను ఆయుధంగా చేసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని, సామాజిక ఐక్యతను పెంపొందించాలని, రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి టిడిపి సీనియర్ నాయకులు నాగిడి నాగేశ్వరావు బిజెపి సీనియర్ నాయకులు కరి చిట్టిబాబు తదితరులు కూటమి నాయకులు, అగ్నికుల క్షత్రియ సంఘ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువత, ప్రజలు మరియు మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు