
గ్రీవెన్స్ సెల్లో 38 అర్జీలు స్వీకరించిన మంత్రి వాసంశెట్టి సుభాష్
జనం న్యూస్ జూలై 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగం (గ్రీవెన్స్ సెల్) కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా మొత్తం 38 అర్జీలు అందాయి. అర్జీదారుల నుంచి నేరుగా వినతిపత్రాలను స్వీకరించిన మంత్రి సుభాష్, ప్రతి సమస్యను పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధానంగా ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు.ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ వారి జీవితాల్లో ఆనందం నింపేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తోందన్నారు.గ్రీవెన్స్ సెల్‌కు వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.