
ప్రజల సమస్యలకు మంత్రి సుభాష్ భరోసా
ప్రజా దర్బార్‌లో 37 అర్జీలు స్వీకరించిన మంత్రి వాసంశెట్టి సుభాష్
జనం న్యూస్ సెప్టెంబర్ ఐదు ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుంచి ప్రజలు ప్రజా దర్బార్‌కు తరలివచ్చి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మొత్తం 37 అర్జీలు అందాయి. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రహదారుల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్ సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థ, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన వినతిపత్రాలను ప్రజలు సమర్పించారు. అర్జీదారులతో మంత్రి సుభాష్ ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా విన్నారు. ప్రతి వినతిపత్రాన్ని సంబంధిత శాఖల అధికారులకు పంపించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీకి ప్రాధాన్యత ఇస్తూ పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడమే తమ ధ్యేయమన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారులు పాల్గొన్నారు.