
ప్రజా దర్బార్లో అర్జీలు స్వీకరించిన మంత్రి వాసంశెట్టి సుభాష్
జనం న్యూస్ ఆగస్టు 8 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు "ప్రజా దర్బార్" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ తెలిపారు.శనివారం రామచంద్రపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి మంత్రి అర్జీలు స్వీకరించారు. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై మొత్తం 34 అర్జీలు అందాయి.ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి సమస్యలు ఒకే వేదికపై పరిష్కారం పొందేలా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజాసేవ అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతోందన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని చివరి దశ వరకు పర్యవేక్షిస్తూ, అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ వేగవంతమైన చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.ప్రజా దర్బార్ ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడంతో పాటు త్వరితగతిన పరిష్కారం పొందుతున్నారని, ఇది ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన అనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉండవల్లి శివ, రూరల్ మండల అధ్యక్షులు, కాజులూరు మండల అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి,కూటమి నాయకులు,కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.