
జనం న్యూస్ 31 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : విదేశీ పర్యటనకు ఆగస్టు 7 వరకు జిల్లా స్థాయిలో నామినేషన్ ప్రక్రియ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలంగాణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యావ్యవస్థ ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం టీచర్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంను చేపట్టిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారుగురువారం హైదరాబాదులోని ఎంసిహెచ్ఆర్డి లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ ఏడాది ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యావ్యవస్థ అధ్యయనానికి వెళ్లి వచ్చిన బృందంతో ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అన్ని జిల్లాల కలెక్టర్లు విద్యా శాఖ జిల్లాల అధికారులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొనగా జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కలెక్టర్ తో పాటు డీఈవో విజయలక్ష్మి, సెక్టోరియల్ అధికారి మైఖేల్, ఉపాధ్యాయులు అగస్టీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రెండో విడత విద్యావ్యవస్థ అధ్యయనానికి సింగపూర్, వియత్నం చైనా జపాన్ ఫిన్లాండ్ దేశాలకు మరో బృందాన్ని పంపనున్నట్లు తెలిపారు. మన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని సమాజంలో సమూల మార్పులు తీసుకురావడానికి విద్య దోహదపడుతుందన్నట్లు చెప్పారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు రాబోయే ఐదేళ్లలో విద్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఒక విజన్ తో ముందుకెళ్లాలన్నారు. విద్య, నైపుణ్య అభివృద్ధితోనే యువత భవిష్యత్తు బంగారు మయం అవుతుందన్నారు. అందుకే ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ యంగ్ ఇండియా పాఠశాలలను ప్రారంభిస్తున్నామన్నారు. ఇంటరాక్షన్ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటన విడుదల చేశారు అంతర్జాతీయ స్థాయి విద్యా విధానాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీచర్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఫేజ్-II కింద జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులను నామినేషన్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీచర్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఫేజ్-Iలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 24,2026 వరకు తెలంగాణకు చెందిన ఉపాధ్యాయులతో పాటు తాను కూడా ఫిన్లాండ్లో నిర్వహించిన అంతర్జాతీయ విద్యా అధ్యయన పర్యటనలో పాల్గొన్నట్లు తెలిపారు. అక్కడి ప్రపంచ స్థాయి విద్యా విధానాలు, విద్యార్థి కేంద్రిత బోధన, పాఠశాల నిర్వహణలో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు.ఆ అనుభవాలు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంలో ఎంతో దోహదపడతాయని తెలిపారు. అదే విధంగా ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఫేజ్-IIలో భాగంగా ఫిన్లాండ్,సింగపూర్ జపాన్, వియత్నాం చైనా దేశాలకు రాష్ట్రవ్యాప్తంగా 190 మంది ఉత్తమ ఉపాధ్యాయులు,ప్రధానోపాధ్యాయులను పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందులో జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఆరుగురు ఉత్తమ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను నామినేషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు.వీరిలో ప్రిన్సిపల్/జీహెచ్ఎం కేడర్ నుంచి ఇద్దరు స్కూల్ అసిస్టెంట్/పీజీటీ లేదా సమాన కేడర్ నుంచి ఇద్దరు ఎస్జీటీ/టీజీటీ లేదా సమాన కేడర్ నుంచి ఇద్దరు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇద్దరు పురుషులు,నలుగురు మహిళలు ఉండేలా ఎంపిక చేపట్టడంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అదనపు కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా కలెక్టర్ నామినేట్ చేసే ఒక అధికారి సభ్యులుగా ఉన్న జిల్లా స్థాయి కమిటీ నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతి దరఖాస్తును నిబంధనలకు అనుగుణంగా క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారినే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ఎంపికకు అర్హులైన అభ్యర్థులు 2026 ఆగస్టు 1 నాటికి 55 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలని,కనీసం 10 సంవత్సరాల సేవా అనుభవం ఉండాలని ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో 100 మందికి తగ్గకుండా విద్యార్థులు ఉండాలని ఎలాంటి శాఖాపరమైన విచారణలు చార్జ్షీట్లు లేదా క్రిమినల్ కేసులు ఉండకూడదని విదేశీ పర్యటనకు అనుకూలమైన ఆరోగ్య పరిస్థితి కలిగి ఉండాలని తెలిపారు. ఎంపికలో గత మూడు సంవత్సరాల పనితీరును సమగ్రంగా పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదల ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ పాఠశాల నమోదు పెంపు, డ్రాప్అవుట్ల తగ్గింపు వినూత్న బోధనా విధానాలు డిజిటల్ టెక్నాలజీ వినియోగం పాఠశాల అభివృద్ధిలో చేసిన సేవలు కమ్యూనిటీ భాగస్వామ్యం ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల్లో రిసోర్స్ పర్సన్‌గా సేవలు రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులు పరిశోధన ఈ-కంటెంట్ రూపకల్పన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అంతర్జాతీయ విద్యా విధానాలపై అవగాహన వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారినే ఎంపిక చేస్తామని తెలిపారు. అభ్యర్థులందరి అర్హతలను పూర్తి పత్రాధారాలతో జిల్లా స్థాయిలో ధృవీకరించి ఆగస్టు 7 2026లోపు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని అనంతరం రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీ తుది ఎంపిక చేపడుతుందని తెలిపారు. విదేశీ విద్యా అధ్యయన పర్యటన ద్వారా పొందిన అనుభవాలను జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసి విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ఎంపికయ్యే ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆకాంక్షించారు. జారీ చేయువారు డిపిఆర్ఓ జోగులాంబ గద్వాల జిల్లా.