

బిచ్కుంద ఆగస్టు 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) బిచ్కుంద లో కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ‘షీ టీమ్స్’ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు మరియు కళాబృంద ప్రదర్శన నిర్వహించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా. జి. వెంకటేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిచ్కుంద ASI డి. దేవరాజ్, వక్తగా షీ టీమ్ డివిజనల్ ఇన్ఛార్జ్ శ్రీమతి పార్వతి హాజరయ్యారు.ఈ సందర్భంగా షీ టీమ్ కళా బృంద సభ్యులు ఆర్ .తిరుపతి,అనిల్ కుమార్,సాయిలు పాటలు, రూపకాల ద్వారా మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, మరియు మత్తు పదార్థాల నిరోధం (యాంటీ డ్రగ్స్) పై విద్యార్థులకు చైతన్యం కలిగించారు.బస్టాండ్లు, ప్రధాన చౌరస్తాలు, రద్దీ ప్రాంతాలు మరియు కళాశాలల వద్ద షీ టీమ్స్ నిరంతరం నిఘా ఉంచుతాయని తెలిపారు. ఈవ్‌టీజింగ్ లేదా వేధింపులకు గురయ్యే మహిళలు, విద్యార్థినులు భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. అత్యాశకు పోయి ఆన్లైన్ మోసాలు, అనధికారిక లోన్ యాప్‌ల బారిన పడవద్దని హెచ్చరించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.మహిళలకు ఏదైనా ప్రమాదం ఎదురైనా, బెదిరింపులకు గురైనా వెంటనే 112 నంబర్‌కు డయల్ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత విభాగం కోఆర్డినేటర్ Y. రేవతి, రాజనీతి శాస్త్ర విభాగం అధిపతి డా. టి. అశోక్ రావ్, కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.