
జనం న్యూస్ 03 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ దేశంలోని ప్రతి చిన్నారికి సమాన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ దేశంలో గత పదేళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం అత్యంత ఆందోళనకరమైన పరిణామమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు మొరుగు వీరేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన పాఠశాల విద్యా వ్యవస్థ కాలానుగుణ విశ్లేషణ నాణ్యత మెరుగుదలకు విధాన ప్రణాళిక నివేదికలో వెల్లడైన అంశాలు దేశ విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను స్పష్టంగా తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు. నివేదిక ప్రకారం 2014–15లో దేశవ్యాప్తంగా 11.07 లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 2024–25 నాటికి అవి 10.13 లక్షలకు తగ్గాయని, అంటే దాదాపు 94 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడినట్లు పేర్కొనడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రోజుకు సగటున 25 ప్రభుత్వ పాఠశాలలు మూతపడినట్టుగా ఈ గణాంకాలు సూచిస్తున్నాయని తెలిపారు.అదే సమయంలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య తగ్గుతుండగా ప్రైవేట్ పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరగడం విద్యా రంగంలో అసమానతలను పెంచుతోందన్నారు. పాఠశాలల విలీన ప్రక్రియలో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ముందుండగా ఈ రెండు రాష్ట్రాల్లోనే సుమారు 40 వేల పాఠశాలలు విలీనమైనట్లు నివేదిక వెల్లడించిందని గుర్తుచేశారు.విద్యార్థుల నమోదు (ఎన్రోల్మెంట్) కూడా తగ్గుముఖం పట్టడం మరింత ఆందోళన కలిగించే విషయమని మొరుగు వీరేష్ అన్నారు. 2014–15లో ప్రభుత్వ పాఠశాలల్లో 26.95 కోట్ల మంది విద్యార్థులు నమోదై ఉండగా, 2024–25 నాటికి ఈ సంఖ్య 24.69 కోట్లకు పడిపోయిందని, అంటే పదేళ్లలో సుమారు 2.26 కోట్ల మంది విద్యార్థుల నమోదు తగ్గిందని తెలిపారు.ఉన్నత తరగతులకు వెళ్లే కొద్దీ డ్రాపౌట్ రేటు పెరుగుతుండడం కూడా తీవ్రమైన సమస్యగా మారిందన్నారు. ప్రాథమిక స్థాయిలో డ్రాపౌట్ రేటు 0.3 శాతం ఉండగా ప్రాథమికోన్నత స్థాయిలో 3.5 శాతానికి, సెకండరీ స్థాయిలో 11.5 శాతానికి చేరిందని పేర్కొన్నారు. అలాగే తొమ్మిదో తరగతి విద్యార్థుల్లో బీజగణితం, జ్యామెట్రి, శాతాలు, భిన్నాలు, నిష్పత్తులు వంటి ప్రాథమిక గణిత అంశాలపై అవగాహన లోపిస్తున్నట్లు నివేదికలో వెల్లడైందని గుర్తు చేశారు.ఈ పరిస్థితులు దేశంలోని పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో లేకుండా చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయకుండా నిర్లక్ష్యం చేస్తే సామాజిక, ఆర్థిక అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు ప్రతి చిన్నారికి వారి కులం మతం ప్రాంతం జాతి లింగం లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా సమానమైన నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని మొరుగు వీరేష్ పేర్కొన్నారుప్రభుత్వ పాఠశాలల మూసివేత విద్యార్థుల నమోదు తగ్గుదల డ్రాపౌట్ల పెరుగుదల వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర సమీక్ష నిర్వహించి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల నియామకాలు నాణ్యమైన బోధన, డిజిటల్ విద్యా సదుపాయాలు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించి ప్రభుత్వ విద్యపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాలను కోరారు.పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం ద్వారానే సమాన అవకాశాలు కలిగిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని విద్యను హక్కుగా భావించి దానిని మరింత బలోపేతం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మొరుగు వీరేష్ విజ్ఞప్తి చేశారు
