
బిచ్కుంద సెప్టెంబర్ 9 జనం న్యూస్ ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా బిచ్కుంద మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి మున్సిపల్ చైర్ పర్సన్ సీమ షెట్కర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, కాళోజీ నారాయణరావు తెలంగాణ మట్టిలోని ఆత్మగౌరవాన్ని, ప్రజా సమస్యలను తన కలం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన అక్షరయోధుడని కొనియాడారు. "అన్యాయాన్ని ఎదిరిస్తేనే ప్రజాస్వామ్యానికి అర్థం" అని నమ్మి, జీవితాంతం ప్రజాపక్షాన నిలబడి పోరాడిన మహోన్నత వ్యక్తి కాళోజీ అని పేర్కొన్నారు. ఆయన రాసిన ప్రతీ కవిత, ప్రతీ మాట సామాన్య ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చాయని గుర్తుచేశారు. తెలంగాణ భాష, సంస్కృతుల పరిరక్షణకు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు కాళోజీ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.సామాజిక రుగ్మతలపై సమరం చేస్తూ, అణచివేతకు గురైన వర్గాల గొంతుకగా నిలిచిన ప్రజాకవి కాళోజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పునికి పుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాళోజీకి మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. సమాజంలో మార్పు కోసం కాళోజీ పడ్డ తపన భావితరాలకు ఎల్లప్పుడూ మార్గదర్శకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ షేక్ హయూమ్ వైస్ చైర్మన్ లక్ష్మి ప్రేమ్ సెట్ కౌన్సిలర్ నౌషా నాయక్ ధర్పల్లి గంగాధర్, కౌన్సిలర్ కార్తిక సంతోష్ కౌన్సిలర్ శ్యామల కోఆప్షన్ నెంబర్ చింతల్ హనుమాన్లు, కాంగ్రెస్ నాయకుడు పండరి మరియు మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్ వెంకట్ రెడ్డి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.