
జనం న్యూస్ | ఏర్గట్ల, ఆగస్టు 8: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.కొత్తగా మంజూరు చేయనున్న వితంతు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, తలసేమియా బాధితులు, డయాలసిస్ రోగుల పింఛన్ల కోసం గ్రామపంచాయతీ కార్యాలయాలు, మండల ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హత ఉన్న వారికి ఎలాంటి వివక్ష లేకుండా పింఛన్లు అందిస్తామని, దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు.కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం మండల ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని శివకుమార్ కోరారు. రేషన్ కార్డులు అవసరమైన అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ప్రభుత్వం పేదలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తోందన్నారు.మండలంలో ఇప్పటికే 500కు పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, మరో 500 ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని శివకుమార్ తెలిపారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సోమ దేవారెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉన్నా పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో సుమారు 300 మందికి ఇళ్ల అవసరం ఉండగా, గత పదేళ్లలో కేవలం 42 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రమే ఇచ్చారని, అవి కూడా అసంపూర్తిగా, నాణ్యత లోపాలతో ఉన్నాయని ఆరోపించారు.అర్హులైన లబ్ధిదారులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అన్ని అంశాలను పరిశీలిస్తున్నారని తెలిపారు. నిజమైన అర్హులను గుర్తించి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారని, త్వరలో ఇళ్ల కేటాయింపు జరుగుతుందని శివకుమార్ తెలిపారు.ఈ సమావేశంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెండ్ల రాజారెడ్డి, సర్పంచులు, ఉపసర్పంచులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.