
15వ వార్డు చావిడి వద్ద శిథిలాలను జేసీబీతో తొలగింపు – ప్రజలు పాత, శిథిలావస్థలో ఉన్న ఇళ్లకు దూరంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి సూచన
జనం న్యూస్ | జూలై 30 | జగిత్యాల జిల్లా : మెట్పల్లిమెట్పల్లిలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పట్టణంలోని 15వ వార్డు చావిడి ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న ఓ పాత ఇంటి గోడలు కూలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేదా ప్రమాదాలు జరగకుండా మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బందితో కలిసి జేసీబీ సాయంతో కూలిపోయిన శిథిలాలను తక్షణమే తొలగించే చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యంగా పాత, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాద సూచనలు కనిపించిన వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని, శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, 20వ వార్డు కౌన్సిలర్ మసూల ప్రవీణ్, కో-ఆప్షన్ సభ్యుడు పన్నాల మాధవ్ రెడ్డి, నాయకుడు అరిగేలా రాకేష్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.