
ముమ్మిడివరం: ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని పుష్కర ఘాట్లను అభివృద్ధి చేసి భక్తులు మరియు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో మొత్తం 23 పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులకు రూ.11 కోట్ల 68 లక్షలు మంజూరయ్యాయి. కాట్రేనికోన మండలంలో 3 ఘాట్లకు రూ.395.94 లక్షలు, ముమ్మిడివరం మండలంలో 5 ఘాట్లకు రూ.172.11 లక్షలు, ఐ.పోలవరం మండలంలో 12 ఘాట్లకు రూ.464.94 లక్షలు, తాళ్లరేవు మండలంలో 3 ఘాట్లకు రూ.135.00 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో పుష్కర ఘాట్ల వద్ద అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధి చేయడంతో పాటు భక్తులు, స్థానిక ప్రజలకు సురక్షితమైన సౌకర్యవంతమైన వాతావరణం కల్పించే చర్యలు చేపట్టనున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని, పుష్కర ఘాట్ల అభివృద్ధితో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలకు మరింత వసతులు సమకూరనున్నాయని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.