
నందికొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ వద్ద వన మహోత్సవ కార్యక్రమం
జనం న్యూస్- ఆగస్టు 25- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో వనమహోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కమిషనర్ ఎస్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక 5వ వార్డు నెహ్రూ పార్కు వద్ద మాస్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ రాజా ప్రసాద్, మాజీ జెడ్పీ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, హాలియా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ఎంత ముఖ్యమో పచ్చదనం కూడా అంతే ముఖ్యమని, మన ఇల్లు వీధి ఊరు పచ్చదనంతో నిండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. వైస్ చైర్మన్ రాజా ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో రెండు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపల్ కౌన్సిలర్ లు, కో ఆప్షన్ మెంబర్ లు,మున్సిపల్ సిబ్బంది , వార్డు అధికారులు,మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.