
జనం న్యూస్ 19 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పేరుకే జోగులాంబ గద్వాల్ జిల్లా పట్టణం 9వ వార్డు రాఘవేంద్ర కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ చెత్త డంపింగ్ యార్డ్ స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది గతంలో కాలనీకి దూరంగా ఉన్న ఈ డంపింగ్ ప్రదేశం ప్రస్తుతం కాలనీ విస్తరించడంతో నివాస గృహాల మధ్యలో ఉన్నట్లుగా మారింది. దీంతో ప్రతిరోజూ వివిధ వార్డుల నుండి తీసుకొచ్చే తడి చెత్త పొడి చెత్తను ఇక్కడే డంప్ చేయడంతో పరిసర ప్రాంతాల్లో భరించలేని దుర్వాసన వ్యాపిస్తోందిఉదయం వాకింగ్‌కు వెళ్లే ప్రజలు విద్యార్థులు వృద్ధులు మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చెత్త కుప్పల వల్ల దోమలు ఈగలు విపరీతంగా పెరిగి సమీప ఇళ్లలోకి చేరుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దుర్వాసనతో ఇబ్బందులు పడుతుండగా రానున్న వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు.పర్యావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం నివాస ప్రాంతాలకు సమీపంలో చెత్త డంపింగ్ కొనసాగితే డెంగ్యూ మలేరియా చికున్‌గున్యా వైరల్ జ్వరాలు చర్మ వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది వర్షాల సమయంలో చెత్తలో నిల్వ ఉండే నీరు దోమల పెంపక కేంద్రాలుగా మారి ప్రజారోగ్యానికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది అంతేకాకుండా చెత్త నుండి వెలువడే దుర్వాసన విషవాయువులు చిన్నారులు వృద్ధులు గర్భిణీలు మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నివాస ప్రాంతాల మధ్య చెత్త డంపింగ్ కొనసాగడం ప్రజల ఆరోగ్య హక్కులకు భంగం కలిగించే అంశమని స్థానికులు పేర్కొంటున్నారు.కాబట్టి స్థానిక వార్డు కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి రాఘవేంద్ర కాలనీ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్‌ను తొలగించి పట్టణానికి కనీసం రెండు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించే ప్రదేశానికి తరలించాలని కాలనీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది మరొకటి లేదని, సమస్య తీవ్రరూపం దాల్చకముందే అధికారులు చర్యలు తీసుకుని రాఘవేంద్ర కాలనీ వాసులకు ఉపశమనం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది