
ఎమ్మెల్యే డా. సంజయ్ కృషితో రూ.26 లక్షల నిధులు మంజూరు
జనం న్యూస్, సెప్టెంబర్ 10, జగిత్యాల జిల్లా : మెట్పల్లి మెట్పల్లి మండలం రాజేశ్వరరావుపేట గ్రామ ప్రజల దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామంలోని శ్మశాన వాటికకు వెళ్లే ప్రధాన మార్గంలో కల్వర్టు నిర్మాణానికి రూ.26 లక్షల నిధులు మంజూరయ్యాయి. కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల ప్రజల అవసరాన్ని గుర్తించి జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రం మేరకు ఈ నిధులు మంజూరైనట్లు సమాచారం.రాజేశ్వరరావుపేట గ్రామంలోని శ్మశాన వాటికకు వెళ్లే రహదారిపై కల్వర్టు సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో నీరు నిలిచిపోవడంతో పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. ముఖ్యంగా అంత్యక్రియల సమయంలో శ్మశాన వాటికకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. వర్షాలు కురిసినప్పుడు ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుండటంతో గ్రామస్తులు కల్వర్టు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్ల 2026 ఆగస్టు 16న జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. రాజేశ్వరరావుపేటలోని శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో కల్వర్టు నిర్మాణం కోసం సుమారు రూ.26 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, VB-G-RAM నిధుల కింద వెంటనే నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు.ఎమ్మెల్యే సమర్పించిన వినతిపత్రం, గ్రామ ప్రజల అవసరాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, IAS, సెప్టెంబర్ 10, 2026న రూ.26 లక్షల అంచనా వ్యయంతో కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.కల్వర్టు నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగడంతో పాటు గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న సమస్యకు నిధులు మంజూరు కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ప్రజల సమస్యను గుర్తించి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, రూ.26 లక్షల నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కల్వకుంట్లకు రాజేశ్వరరావుపేట గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.