
జనం న్యూస్ 08 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఆయిల్ పామ్ సాగుతో కూడా మంచి ఆదాయం ఎల్ నినో ప్రభావంతో ఈసారి వర్షాలు కురిసే అవకాశం తక్కువ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నందున రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న జలాశయాల నుంచి ప్రస్తుతం పెద్ద ఎత్తున వరద వస్తున్నప్పటికీ ఆ నీటిని జిల్లాలో ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపుకొని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. జూరాల ప్రధాన కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసినప్పటికీ వరద తగ్గుముఖం పడితే కాలువలకు నీటి సరఫరా నిలిపి వేయడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా పడతాయన్న వాతావరణ శాఖ సూచనల మేరకు ఖరీఫ్ సీజన్ మొత్తం కాలువల ద్వారా నీటి విడుదల చేసే విషయంపై స్పష్టత లేదన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఆయకట్టు రైతులకు వరి సాగు చేయవద్దని ఇప్పటికే తెలియజేయడం జరిగిందన్నారు. ఈనెల 7న హైదరాబాదు నుంచి పలువురు మంత్రులు, అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. వచ్చే వేసవి ముగిసే వరకు ప్రజల తాగు నీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ వరద నీటితో ఎత్తిపోతల పథకాల ద్వారా జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలను నింపుతున్నట్లు తెలిపారు. కందులు, మిర్చి, మొక్కజొన్న, పెసర్లు మినుములు, కూరగాయలు, తదితర ఆరుతడి పంటలతో కూడా రైతులకు మంచి ఆదాయం చేకూరుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బరత పప్పు దినుసుల పథకం కింద సబ్సిడీకి కందులు మినుముల విత్తనాలు అంద జేస్తున్నందున జిల్లా రైతులు తమ సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వరి పంటకు నాలుగు నెలల పాటు మడులలో నిత్యం రెండు ఇంచుల నీళ్లు నిలువ చేయాల్సి వస్తుందని, కాబట్టి తక్కువ నీటితో పండించుకునే ఆరుతడి పంటలు సాగు చేసుకోవడం శ్రేయస్కరమని తెలిపారు. పంటల వైవిధ్యంతోనే నేల సారవంతత కూడా పెరుగుతుందని, పంట మార్పిడి విధానాలు రైతులకు మేలు చేస్తాయని ఇప్పటికే వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు తెలియజేశారన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పందిరి కూరగాయల సాగుకు పందిరి నిర్మించుకునేందుకు ఒక్కో రైతుకు రెండున్నర ఎకరాల వరకు ఐదు యూనిట్ల చొప్పున, యూనిట్ కు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం అందజేస్తున్నందున అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఆయిల్ పామ్ పంటల సాగును కూడా ప్రోత్సహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఆయిల్ పామ్ మొక్కల మధ్యన అంతర పంటలుగా మూడేళ్లపాటు పప్పు దినుసులు, కూరగాయలు వంటి స్వల్ప కాలిక పంటలతోనూ లబ్ధి పొందవచ్చన్నారు. పామ్ గెలలు నాలుగో సంవత్సరం నుంచి వస్తాయని, అప్పుడు సమీపంలోని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మంచి ఆదాయాన్ని పొందవచ్చన్నారు. ఆయిల్ పామ్ తోటల సాగుకు ప్రభుత్వం రైతులకు సబ్సిడీకి మొక్కలను అందజేయడంతో పాటు బిందు సేద్య పరికరాలను కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఈ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున రైతులు వరి వంటి సాంప్రదాయ పంటలకు బదులుగా ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉన్న పామ్ తోటలతో ఆర్థిక పురోగతి సాధించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.జారీ చేయువారు: డీపీఆర్ఓ జోగులాంబ గద్వాల జిల్లా