
జనం న్యూస్ ఆగస్టు 20 (ముమ్మిడివరం ప్రతినిధి )ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆదేశాల ప్రకారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని రైతులందరూ తమ పంట వివరాలను స్వయంగా నమోదు చేసుకునేందుకు 'ఈ-పంట' యాప్ ద్వారా ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని కాట్రేనికోన మండల వ్యవసాయశాఖధికారి బి.మృదుల ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి 'ఏపీవీఏఎంఎస్ 2.0 ఫార్మర్ యాప్' డౌన్లోడ్ చేసుకుని, అందులో తమ సాగు వివరాలను నమోదు చేసి, ధృవీ కరించు కోవాలని ఆమె సూచించారు. ఈ యాప్‌లో నమోదు చేసే సమయానికి పంటకు కనీసం 30 రోజుల వయస్సు నిండి ఉండాలని, రైతులు నమోదు చేసిన వివరాలను తదుపరి ఆమోదం కొరకు సంబంధిత రైతు సేవా కేంద్రం (ఆర్.బి.కె) సహాయకుని లాగిన్‌కు పంపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అధికారులు ఈ వివరాలను పరిశీలించి ఆమోదించిన తర్వాత, రైతులు తమ పంట సమాచారాన్ని స్వయంగా యాప్‌లోనే సరిచూసుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వం అందించే ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ రుణాలు, కనీస మద్దతు ధర (ఎమ్.ఎస్.పి) మరియు ఇన్-పుట్ సబ్సిడీ వంటి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, రాయితీలు పొందడానకి ఈ డిజిటల్ ఈ-పంట నమోదు అత్యంత కీలకమని, కాబట్టి మండల పరిధిలోని రైతులెవరూ నిర్లక్ష్యం చేయకుండా గడువులోగా తమ పంటలను నమోదు చేయించుకోవాలని ఏఓ బి. మృదుల ఈ పత్రికా ప్రకటన ద్వారా కోరారు.