
జనం న్యూస్, జూలై 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి జీహెచ్ఎంసీ నిర్వహించిన "వన్ డే – వన్ వార్డ్" కార్యక్రమంలో స్థానిక ప్రజలు తమ ప్రాంతాల్లో నెలకొన్న పలు మౌలిక సదుపాయాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమానికి హాజరైన మాజీ కార్పొరేటర్ సాబియా గౌసుద్దీన్తో పాటు స్థానిక కాలనీల ప్రతినిధులు పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కమిషనర్‌ను కోరారు.మాజీ కార్పొరేటర్ సాబియా గౌసుద్దీన్ మాట్లాడుతూ, గూడ్ షెడ్ రోడ్ నుంచి ఐడీఎల్ చెరువు వరకు లింక్ రోడ్డు మంజూరు చేయాలని, ఇంటింటికీ చెత్త సేకరణ కోసం ఎస్ఏటీ ఆటోల సంఖ్యను పెంచాలని, రామారావు నగర్ కాలనీలో నాలా విస్తరణ చేపట్టాలని, డే గ్లో సైన్‌బోర్డులు, కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, అలాగే సర్దార్ నగర్, రామారావు నగర్, శ్రీనగర్ కాలనీల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా స్థానిక నివాసితులు నిరంతర తాగునీటి సరఫరా, మ్యాన్‌హోల్స్ మరమ్మతులు, మ్యాన్‌హోల్స్‌లో పేరుకు పోయిన మట్టిని తొలగించడం, ఇండోర్ స్టేడియంలో షూ ర్యాకులు, అల్మారాల ఏర్పాటు, ఆర్కే సొసైటీ కాలనీలోని బస్తీ దవాఖానకు మరుగుదొడ్లు, ప్రహరీ గోడ నిర్మాణం, దోమల నివారణ కోసం క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించడం, అలాగే హిందూ శ్మశానవాటికలో వాచ్‌మన్ గది, ఇతర మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కోరారు.ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని అధికారులు నమోదు చేసుకుని, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ సంబంధిత విభాగాలతో సమన్వయం చేసి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.