
జనం న్యూస్ , జూన్ 3 ( జిల్లా ఇంచార్జ్ ) రానున్న వర్షా కాలంలో పట్టణ ప్రజలు వరద నీటి సమస్యలతో ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పలు వార్డుల్లో కాలువల శుభ్రపరిచే పనులను ప్రారంభించారు. పట్టణ పరిధిలోని ధర్మారం, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో వర్షాకాలంలో అధిక వర్షాల కారణంగా వరద నీరు నిల్వ ఉండటంతో గృహవాసులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రైవేట్ జేసీబీలను లీజుకు తీసుకుని కాలువల తవ్వకం, శుభ్రపరిచే పనులు చేపట్టినట్లు చైర్మన్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి మూడు నెలలు పూర్తయిన సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో స్థానిక కౌన్సిలర్ పోలు దివ్య బిక్షపతి, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.