
జనం న్యూస్ జూన్ 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు ఉన్న ప్రాంతాల వద్ద అత్యంత అప్రమత్తంగా ఉండాలని కూకట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు సూచించారు. వర్షం పడుతున్న సమయంలో లేదా వర్షం అనంతరం విద్యుత్ స్తంభాల సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాల వద్ద నీరు నిల్వ ఉండే అవకాశముండటంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు విద్యుత్ స్తంభాలకు ఆనుకుని నిలబడకూడదని, తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు కూడా విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సీఐ సుబ్బారావు సూచించారు. ప్రజల ప్రాణ భద్రతే ముఖ్యమని, అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే పోలీసు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సీఐ సుబ్బారావు కోరారు.