
109 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు, 23 వాహనాలు సీజ్.
జనం న్యూస్ 22 మే వికారాబాద్ జిల్లా :- వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా గారి ఆదేశాల మేరకు శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు పోలీసులు జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్యమైన కూడళ్లు, చౌరస్తాలు, ప్రధాన రహదారుల వద్ద ఏకకాలంలో అత్యంత అప్రమత్తంగా, విస్తృతంగా ‘నాకాబందీ’ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై నిఘా ఉంచడం, రాత్రి వేళల్లో అనవసరంగా తిరిగే వారిని నియంత్రించడమే లక్ష్యంగా ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా సరిహద్దులతో పాటు అంతర్గత రహదారులపై పోలీసులు గట్టి నిఘా ఉంచి,అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాలను, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై 109 డ్రంక్ అండ్ డ్రైవ్ (DD) కేసులు నమోదు చేశారు. అలాగే సరైన పత్రాలు లేని, నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని, నిబంధనలు ఉల్లంఘించిన 23 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ తనిఖీలలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ.. ‘పాపిల్లాన్’ (Papillon) డివైస్ ద్వారా పాత నేరస్థులు, అనుమానితుల వేలిముద్రలను సేకరించి వారి నేర చరిత్రను పరిశీలించారు. చట్టాన్ని, నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, భవిష్యత్తులోనూ ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.