
జనం న్యూస్ ఆగష్టు 14 ముమ్మిడివరం ప్రతినిధి: గ్రంధి నానాజీ : ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి గాను మండలంలోని ప్రభుత్వ, పరిషత్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ (అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్) పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల విద్యాశాఖాధికారి నామాల కృష్ణమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మొత్తం 136 పోస్టులు (28 ఎస్జీటీ, 108 స్కూల్ అసిస్టెంట్) ఖాళీగా ఉన్నాయని, ఈ నియామకాలు పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన మండల స్థాయిలో పారదర్శకంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను పూర్తి వివరాలు మరియు విద్యార్హతల ధృవీకరణ పత్రాలతో సహా ఈనెల 19వ తేదీ లోపు స్థానిక మండల విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో సమర్పించాలని ఆయన కోరారు. అకడమిక్ మరియు ప్రొఫెషనల్ కోర్సుల్లో సాధించిన మార్కులను 75:25 నిష్పత్తిలో పరిగణనలోకి తీసుకుని, జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించే ప్రత్యేక కమిటీ ద్వారా పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఈ ఎంపికలు జరుగుతాయని స్పష్టం చేశారు. స్థానిక గ్రామం లేదా మండల అభ్యర్థులకు, అలాగే టెట్ అర్హత సాధించిన వారికి ఎంపికలో మొదటి ప్రాధాన్యత ఉంటుందని, సెప్టెంబర్ 1, 2026 నుండి ఏప్రిల్ 30, 2027 వరకు 8 నెలల తాత్కాలిక కాలపరిమితికి గానూ ఈ నియామకాలు ఉంటాయని తెలిపారు. ఎంపికైన విద్యా వాలంటీర్లకు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు నెలకు రూ.12,500, ఎస్జీటీ పోస్టుకు రూ.10,000 చొప్పున 8 నెలల కాలపరిమితికి (01-09-2026 నుండి 30-04-2027 వరకు) గౌరవ వేతనం చెల్లించబడుతుందని, ఈ ఎంపిక ప్రక్రియ అంతా ఈ నెల 29-08-2026 లోపు పూర్తవుతుందని తెలిపారు. అర్హత గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని, ఈ నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా కాట్రేనికోన మండల విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో సంప్రదించవచ్చునని ఆయన స్పష్టం చేశారు.