
వైద్యానికి రూ.4 లక్షల వరకు అవసరం.. ఆపన్నహస్తం కోసం కుటుంబ సభ్యుల వేడుకోలు
జనం న్యూస్ 24, నిజామాబాద్ జిల్లా: ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న రెమ్మ రణదీష్ శనివారం విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ స్తంభంపై బల్బు అమర్చుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో కిందపడిపోయారు. దీంతో తీవ్ర గాయాలైన రణదీష్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.ప్రమాదంలో వెన్నుపూసకు సంబంధించిన ఎల్4, ఎల్5 భాగాల్లో తీవ్ర గాయం అయినట్లు వైద్యులు గుర్తించారు. తక్షణమే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.శస్త్రచికిత్సతో పాటు వైద్య చికిత్సకు సుమారు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రణదీష్ కుటుంబానికి ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడం కష్టంగా మారింది.రెమ్మ రణదీష్ ప్రాణాలు కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించి చికిత్సకు అండగా నిలవాలని కోరుతున్నారు. మీ చిన్న సాయం.. రణదీష్కు కొత్త జీవితాన్ని అందించే పెద్ద భరోసా అని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.