
జనం న్యూస్ సెప్టెంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) మార్కాపురం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభోత్సవం సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.గత రెండు దశాబ్దాలుగా వెలిగొండ ప్రాజెక్టు కోసం వివిధ వేదికలపై నిరంతరం పోరాడుతూ, ప్రజల గొంతుకగా నిలిచిన బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పోరాట స్ఫూర్తిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. సోమవారం దోర్నాల మండలం గంటావానిపల్లి వద్ద వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు తొలి దశను జాతికి అంకితం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డిని చంద్రబాబు ఆత్మీయంగా పలకరించి, వెలిగొండ కోసం ఆయన చేసిన సుదీర్ఘ పోరాటాన్ని అభినందించినట్లు తెలిసింది. వెలిగొండ ప్రాజెక్టు కోసం ఏలూరి రామచంద్రారెడ్డి గత 20 ఏళ్లుగా ప్రజలతో కలిసి నిరంతరం ఉద్యమాలు, సమావేశాలు, వినతులు, ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రాజెక్టు పూర్తికి కృషి చేశారు. ప్రభుత్వాలు మారినా వెలిగొండ అంశాన్ని ప్రజా సమస్యగా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ వెలిగొండ తొలి దశ సోమవారం ప్రారంభం కావడంతో మార్కాపురం ప్రాంత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు 1996 మార్చి 5న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. సుమారు 30 ఏళ్ల అనంతరం అదే ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి హోదాలో జాతికి అంకితం చేయడం విశేషంగా నిలిచింది. తొలి దశ ప్రారంభోత్సవంలో భాగంగా కృష్ణా జలాలను విడుదల చేయడంతో మార్కాపురం ప్రాంతంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. తొలి దశ ద్వారా కృష్ణా జలాలు నల్లమలసాగర్‌కు చేరుతున్నాయి. ఈ సందర్భంగా వెలిగొండ రెండో దశను 2028 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీంతో వెలిగొండ ద్వారా మరింత విస్తృతంగా సాగు, తాగునీటి ప్రయోజనాలు అందనున్నాయని ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.